
"కాశ్మీర్ ఎప్పటికీ భారత్ లో అంతర్భాగం కానే కాదు..ఈ విషయాన్ని భారత ప్రభుత్వం ఇదివరకే అంగీకరించింది" అంటూ ఫైర్‌బ్రాండ్ రచయిత్రి అరుంధతీ రాయ్ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లోకెక్కి హల్‌చల్ చేశారు. ఎవరేమనుకున్నా నేననుకున్నదే మాట్లాడుతాను అని చాలా సందర్భాల్లో చెప్పిన అరుంధతీరాయ్ తాజా వ్యాఖ్యలతో తన ప్రత్యేకతను మరోసారి చాటుకున్నారు. అన్నట్టు మర్చిపోయాను ఈ ఫైర్‌బ్రాండ్ రచయిత్రి మావోయిస్టులకు సానుభూతిపరురాలు కూడా. మావోయిస్టులు చేస్తున్న పోరాటం న్యాయమైనదని...ప్రభుత్వం మావోయిస్టులను అణిచివేసేందుకు కుట్రలు పన్నుతోందని..రాయ్ విరుచుకుపడటం మనం ఎప్పుడూ వింటూనే ఉంటాం. ఇక వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ఈ ఫైర్‌బ్రాండ్ లేడీకి ఎదురేలేదు. పార్లమెంట్ పై ఉగ్రవాదులు దాడి చేసినపుడు , ముంబయ్ లో కసబ్ అండ్ పార్టీ అమాయకులను ఊచకోత కోసినపుడు అరుంధతి రాయ్ చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదాన్నే సృష్టించాయి. ప్రత్యేక కాశ్మీర్ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేసే అరుంధతి మావోయిస్టులను "గాంధేయవాదు"లంటారు. ఈ వ్యాఖ్య ఆమె ఏ ప్రతిపాదికన చేశారన్నది మన ఆలోచించకపోవడమే మంచిది. కాశ్మీరీలకు అన్యాయం జరిగిపోతుందని అరుంధతీ రాయ్ తెగ ఆవేదన చెందుతారు. భారత సార్వభౌమత్వాన్ని , ప్రజాసామ్యాన్ని గౌరవిస్తూ 80 శాతం మంది కాశ్మీరీలు ఓటింగ్ లో పాల్గొన్న విషయం ఈమెకు తెలియదా? సందర్భం వచ్చినప్పుడల్లా వారికి ప్రత్యేక కాశ్మీర్ ఇచ్చేయాల్సిందేనంటూ స్పీచ్‌లూ ఇస్తుంటారు. కాశ్మీర్లో భారత సైన్యం అత్యాచారాలు పెచ్చుమీరిపోయాయని , వారికి వెనక్కి పిలవాలని డిమాండ్ చేస్తారు. భారతదేశంలో అణిచివేత, వలసవాద , పెట్టుబడిదారీ వ్యవస్థలు వేళ్లూనుకున్నాయని ఈ దేశంలో ఎవరికీ స్వేచ్ఛా స్వతంత్రాలు లేవని , అందరి హక్కులను హరించివేస్తున్నారని అరుంధతీ రాయ్ ఆరోపిస్తుంటారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు అర్థాన్నే మార్చేసిన అరుంధతీ రాయ్ మన దేశంలో హక్కుల గురించి మాట్లాడటం హాస్యాస్పదం కాదంటారా? దేశంలో అంతర్భాగమైన ఒక ప్రాంతాన్ని అంతర్భాగం కాదంటూ మాట్లాడే మాటలు మన దేశంలో కాకుండా మిగతా దేశాల్లో చెల్లుబాటవుతాయా? మాతృభూమిని కాపాడుకునేందుకు అహోరాత్రులు ప్రాణాలను పణంగా పెట్టి కాపాలా కాస్తున్న సైనికులను అపహాస్యం చేసే ఇలాంటి వ్యక్తులు మనకు అవసరమా? ప్రతీ విషయాన్ని భూతద్దంలో చూస్తూ ప్రచారం కోసం అర్థంలేని వ్యాఖ్యలు చేసే అరుంధతీ రాయ్ లాంటి వారు దేశానికి చేసిన సేవలేమిటి ? ప్రచారమే పరమావధిగా నోటికొచ్చినట్టే మాట్లాడే ఇటువంటి వారు మన వ్యవస్థకు అవసరమా? చిన్నపిల్లలనే కనికరం లేకుండా పిచ్చెక్కిన కుక్కల్లా ముంబయ్ లో మారణహోమం సృష్టించిన తీవ్రవాదులను వారి దాడులను ఖండించాల్సిన సమయంలోనూ సమస్యకు మూలకారణం వెతకాలనే ఈ అతి తెలివి మేధావులను మనం భరించాలంటారా? మావోయిస్టులను అణిచివేస్తున్నారంటూ గొంతు చించుకునే అరుంధతీ రాయ్ వారు సామాన్యులను ఊచకోత కోసినపుడు ఎక్కడ ఉన్నారు ? పోలీసుల చేతిలో మావోయిస్టులు మరిణిస్తే గగ్గోలు పెట్టే మానవ హక్కుల సంఘాల నేతలు మావోయిస్టుల చేతిలో పోలీసులు మరణిస్తే మాత్రం ఉలకరు పలకరు. అటువంటి ఏకపక్ష మానవ హక్కుల సంఘాల నేతలు ఈ ఫైర్‌బ్రాండ్ రచయిత్రి వెంట తిరుగుతూ ఆమె తలతిక్క మాటలకు వంత పాడుతూ ఉంటారు. అవినీతి రాజకీయ నాయకులతో సమానంగా వీరు కూడా మన దేశ పరువును మంటగలపుతూ ...పైపెచ్చు ఏదో దేశ సేవ చేస్తున్నట్టు కలరింగ్ ఇస్తుంటారు. వీరి వలన దేశానికి కలిగిన ప్రయోజనం ఒక్కటైన ఉందా?...నష్టం తప్ప. కాశ్మీర్ ఇండియాలో అంతర్భాగం కాదన్న అరుంధతీ రాయ్, తనకు వ్యతిరేకంగా మాట్లాడే వారిపై జాలి పడుతున్నట్టు ప్రకటించారు. ఆమే కాదు నేను కూడా జాలి పడుతున్నాను... వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా పట్టించుకున్న వారు లేరు... మీడియా కవరేజీ లేదు.. అనవసర ప్రచారం ఎందుకని ప్రభుత్వం కూడా రాజద్రోహం కేసు పెట్టలేదు..పైపైచ్చు పిచ్చివారి మాటలను పట్టించోవద్దంటూ లక్షల కొద్దీ మేసేజ్ లు దేశవ్యాప్తంగా హల్‌చల్ చేశాయి. మరి ఇటువంటి వారిపై జాలి పడక ఏం చేస్తాం చెప్పండి.





